Kishan Reddy: ఇంధన అవసరాల కోసమే బొగ్గు గనుల వేలం 2024-06-21 16:08:54

న్యూస్ లైన్ డెస్క్: దేశంలో ఇంధన అవసరాలను తీర్చేందుకే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనులు వేలం వేస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన బొగ్గు గనుల వేలం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కెట్‌లో బొగ్గుకు విపరీతమైన డిమాండ్ ఉందని, బొగ్గు అంటే నల్ల బంగారమని ఆయన అభివర్ణించారు. బొగ్గు లేనిదే విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదన్నారు. అన్ని పరిశ్రమలకు బొగ్గు ప్రాణాధారమని చెప్పుకొచ్చారు. బొగ్గు గనుల వేలంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలోని శ్రావణపల్లి బొగ్గు గనులను సింగరేణికి ఇవ్వకుండా వేలం వేయడం బాధాకరమని అన్నారు. సింగరేణి 39 బొగ్గు గనులతో నడుస్తున్నప్పటికీ కొత్త గనులు కేటాయించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది ఇలాగే కొనసాగితే కొన్నేళ్లకు సింగరేణి మూతపడే ప్రమాదం ఉందని తెలిపారు. కేంద్రం బొగ్గు గనులను సింగరేణి సంస్థకు అప్పగించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.