Bhatti: తెలంగాణకు బీజేపీ నష్టం చేస్తుంది 2024-06-20 07:06:47

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణకు నష్టం చేసేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గురువారం మీడిమాలో సమావేశంలో భట్టి ఈ వ్యాఖ్యలు చేశారు. సింగరేణికి 40 బొగ్గు గనులు ఉన్నాయని, ప్రస్తుతం 70 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. గనుల చట్టానికి కేంద్రం సవరణలు చేసి ఆమోదించుకుందని మండిపడ్డారు. బొగ్గు గనుల వేలంను కేంద్రం మొదలు పెడుతుందని ఈ నిర్ణయాని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. సింగరేణి గని అంటే ఉద్యోగాల గని అని భట్టి పేర్కొన్నారు. సింగరేణి సంస్థ పరిధిలో ఉన్న అన్ని బొగ్గుబ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రేపు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి ఇదే విషయం విన్నవించబోతున్నామన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న అతి ముఖ్యమైన, కొంగు బంగారం అయిన సింగరేణి సంస్థ భవిష్యత్తు కొనసాగాలంటే కొత్త గనులు రావడం తప్పనిసరి అని తెలిపారు. ఈ గనులను వేలంపాట ద్వారా కాక నేరుగా ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణికి కేటాయించమని కేంద్రాన్ని అడుగుతున్నామని పేర్కొన్నారు. అఖిలపక్షం ద్వారా ప్రధానమంత్రిని రాష్ట్ర ప్రభుత్వం వేడుకోవటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇటీవల వేలం పాటలో పెట్టిన సత్తుపల్లి కోయగూడెం ఓపెన్ కాస్ట్ గనుల వేలంపాటదారులు ఇప్పటివరకు ఆ గనులను చేపట్ట లేదు కనుక వాటిని సింగరేణి సంస్థకు కేటాయించాలని కోరారు.