BRS: బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు నిధులు కేటాయించాలి 2024-06-20 15:05:06

న్యూస్ లైన్ డెస్క్: బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు నిధులు కేటాయించాలని కోరుతూ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకులు గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ పరిషత్ మాజీ చైర్మన్ కేవీ రమణాచారి మాట్లాడారు. బ్రాహ్మణ కులంలోనూ అనేకమంది పేదవాళ్లు ఉన్నారని, కేసీఆర్ సీఎం అయ్యాక బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేశారన్నారు. బ్రాహ్మణుల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. అర్చకులను ప్రతి నెల ధూపదీప నైవేద్యం ద్వారా కేసీఆర్ ఆదుకున్నారని, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు రేవంత్ రెడ్డి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణ విద్యార్థులకు విదేశీ స్కాలర్‌షిప్‌ను విడుదల చేయాలని, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు నిధులు విడుదల చేయడంపై క్యాబినెట్‌లో చర్చ జరపాలన్నారు. జరగబోయే అసెంబ్లీ సమావేశాల వరకు అయినా నిధులు కేటాయించాలన్నారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌లో పని చేసే కింది స్థాయి ఉద్యోగులకు గత ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆరోపణలు చేశారు. నిధులు కేటాయించకపోతే బ్రాహ్మణ సంఘాలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీ సురభి వాణీదేవి మాట్లాడుతూ బ్రాహ్మణుల్లో చాలా మంది నిరుపేదలు ఉన్నారని, బ్రాహ్మణుల గురించి ఆలోచించింది కేసీఆర్ మాత్రమేనాని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీవీ నరసింహారావు బ్రాహ్మణులను ఆదుకున్నారని, ప్రభుత్వాలు మారితే పధకాలు మంచిగా అమలు కావాలన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం మారితే పథకాలు ఆగిపోతున్నాయని మండిపడ్డారు. బ్రాహ్మణుల దగ్గర మేధాసంపత్తి తప్ప ఆస్తులు లేవని, చాలా మంది బ్రాహ్మణులు ఇతర దేశాల్లో స్థిరపడ్డారని తెలిపారు. మన దేశంలో బ్రాహ్మణుల పరిస్థితి దయనీయంగా ఉందని, ప్రభుత్వం నుండి బ్రాహ్మణులకు మద్దతు ఉండాలని డిమాండ్ చేశారు. విదేశాల్లో ఉన్న బ్రాహ్మణ విద్యార్థులకు ప్రభుత్వం వెంటనే స్కాలర్‌షిప్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.